కరీంనగర్

అర్హులైన పేదలకు ఆరు గ్యారెంటీల అమలే అర్హులైన పేదలకు ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా ప్రజాపాలన

-100 రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలు అమలు

-నిరుపేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చెందేలా కృషి

-అధికారులు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించాలి

-నూతన ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా విధుల నిర్వహణ

అర్హులైన పేదలకు ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

బుధవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ లతో కలిసి ప్రజాపాలన గ్రామ,వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు రాష్ట్రంలోని ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి అన్నారు.

డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని వార్డులలో సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు.
గ్రామంలో నిర్వహించే ప్రజాపాలన సభ ముగిసిన తరువాత కూడా ప్రజలు పంచాయతీ కార్యాలయంలో జనవరి 6 వరకు తమ దరఖాస్తు సమర్పించే అవకాశం ఉందని,ఈ మేరకు సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు మార్గదర్శకాలు జారీ చేయాలని మంత్రి ఉన్నతాధికారులకు ఆదేశించారు.

ప్రజా పాలనలో దరఖాస్తుల స్వీకరించే సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు జత చేయాలని, రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తులు స్వీకరించాలని ప్రస్తుతం సేకరించిన దరఖాస్తుల పరిశీలించి, నూతన రేషన్ కార్డుల జారీ పై త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణపై ఎటువంటి సందేహాలు ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని, ప్రజా పాలన సమయంలో అధికారులు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని వారికి వచ్చే అన్ని సందేహాలను నివృత్తి చేయాలని మంత్రి తెలిపారు.ప్రజలు ఎన్నుకున్న నూతన ప్రభుత్వంలో అవినీతికి ఎలాంటి ఆస్కారం ఉండదని, ప్రభుత్వ పథకాలు అర్హులకు అవినీతికి తావు లేకుండా అమలు జరగాలని, అధికారులు పూర్తి పారదర్శకంగా అవినీతి రహితంగా విధులు నిర్వహించాలని మంత్రి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నీటిపారుదల శాఖ ప్రాజెక్ట్ ల పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి తెలిపారు.మంథనిలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, హుస్నాబాద్ లోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ లను డిసెంబర్ 29న పరిశీలించడం జరుగుతుందని, అనంతరం వాటి పై విచారణ నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.
పేద ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిలో బియ్యం పై 39 రూపాయలకు కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇస్తున్నామని, రేషన్ బియ్యం నాణ్యత పెంచే విధంగా అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపడుతుందని, అదే సమయంలో కొంతమంది మిల్లర్లు, ఇతర దళారులు కలిసి రేషన్ బియ్యం రీసైకిలింగ్ కు పాల్పడుతున్నారని, వారి పట్ల ఇక పై నూతన ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తుందని, రేషన్ రీసైక్లింగ్ ప్రక్రియ వెంటనే నిలిపివేయాలని మంత్రి హెచ్చరించారు.
నిరుపేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చెందేలా కృషి చేయడం జరుగుతుందన్నారు.

రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ… పాలనలో మార్పు కావాలని ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని, మార్పు కావాలని ఆకాంక్షించిన వారిలో ప్రభుత్వ ఉద్యోగుల సైతం అధిక సంఖ్యలో ఉన్నారని అన్నారు.

ప్రజలు ఆకర్షించిన మార్పును వారికి అందించే దిశగా, పేదవాడి ముఖంలో చిరునవ్వు వచ్చే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

నూతన ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులలో రెండు గ్యారెంటీలను అమలు చేశామని, మహిళలకు అందించిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల జీరో టికెట్స్ జారీ చేయడం జరిగిందని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ప్రజా పాలన కార్యక్రమానికి వచ్చే దరఖాస్తు దారులను చిరునవ్వుతో స్వాగతించాలని, ప్రతి కేంద్రంలో నిర్లక్ష్యరాస్యుల కోసం సహయకులను ఏర్పాటు చేయాలని, దరఖాస్తుల స్వీకరణ సజావుగా జరిగే విధంగా పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు అందించే వివిధ సేవలకు సంబంధించి సిటిజన్ చార్టర్ ను ప్రవేశ పెడుతుందని, ప్రజలకు నిర్దిష్ట కాలంలో సేవలను లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు వస్తే టోకెన్లు జారీ చేయాలని మంత్రి సూచించారు.

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని ,
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేసే కార్యాచరణ ప్రభుత్వం ప్రారంభించిందని, అర్హులందరికీ పథకాలు వర్తింప చేసేందుకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రజాప్రాలన గ్రామసభల సమయంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల తో పాటు ప్రజలు తమకు ఉన్న ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తే వాటిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సేకరించి పరిశీలించాలని, జిల్లా యంత్రాంగం పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రజా పాలన కార్యక్రమానికి వచ్చిన ఏ ఒక్క దరఖాస్తు తిరస్కరించ వద్దని మంత్రి అన్నారు.

కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ప్రఫూల్ దేశాయ్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాలోని 313 గ్రామ పంచాయతీలలో, 4 మున్సిపాలిటీలలో 1 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 146 వార్డులలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించేందుకు 170 బృందాలను సిద్ధం చేసి వారికి అవసరమైన శిక్షణ అందించామని అన్నారు. కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్న 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులను, మండల ప్రత్యేక అధికారులను నియమించామని, ప్రజా పాలన కార్యక్రమం సజావుగా అమలు చేసేదిగా వారు పర్యవేక్షిస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు.

ప్రతి మండలం పరిధిలో తహసిల్దార్, ఎంపీడీవో ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి బృందం రోజుకు రెండు గ్రామాల చొప్పున పర్యటించి, ప్రతిరోజు ప్రతి బృందం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షెడ్యూల్లో గ్రామసభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందని అన్నారు.

ప్రజాపాలన సభ నిర్వహణకు అవసరమైన త్రాగు నీరు, కుర్చీలు, అవసరమైన బల్లలు, టెంట్ మొదలగు మౌళిక సదుపాయాలు కల్పించామని , ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసామని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమం వద్ద మహిళలకు వృద్ధులకు దివ్యాంగులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసామని తెలిపారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, చింతకుంట విజయరమణా రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, పోలీసు ఉన్నతాధికారులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని తహసిల్దార్లు, ఎంపీడీవోలు మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights