అధికారంలోనే విపక్షం-ఎమ్మెల్యే నిర్ణయం బేఖాతర్ 

బాబు చెప్పినా.. బ్రహ్మ చెప్పినా… ససేమిరా” అన్న చందాన ఆశావహులు

కాయ్ రాజా కాయ్… ఒక్కో కౌన్సిలర్ కు అడ్వాన్స్ రూ.50వేలు ఎర ? పట్టణంలో ప్రచారం

ఎమ్మెల్యే నిర్ణయాన్ని బలపరుస్తారో, డబ్బు ప్రభావానికి లొంగుతారో ?…వెయిట్ అండ్ సీ….

జగిత్యాల మున్సిపల్ లో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లదే మెజారిటీ అన్న సంగతి తెలిసిందే.అయితే, ప్రస్తుతం సాగుతున్న మున్సిపల్ రాజకీయంలో అధికారం కోసం స్వపక్షంలోనే విపక్షం తయారయ్యింది.చైర్పర్సన్ పదవీకాలం ఏడాది మాత్రమే ఉన్నప్పటికీ, ఖాళీ ఏర్పడ్డ ఆ పదవి కోసం బిఆర్ఎస్ పార్టీ కి మెజారిటీ ఉన్నప్పటికీ, ఆ పదవి తమకంటే తమకే కావాలని గత ఏడాది నుంచి నానా అగచాట్లు పడుతున్నారు.

ప్రస్తుత బిఆర్ఎస్ ఎమ్మెల్యే  డా.ఎం.సంజయ్ కుమార్ గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే గా జగిత్యాల మున్సిపల్ లో మెజారిటీ సీట్లు సాధించడం, బిసి మహిళ రిజర్వేషన్ తో బిసి మహిళ డా.శ్రావణికి పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు చైర్పర్సన్ పదవి కట్టబెట్టడం తెలిసిందే.

ఆ తర్వాత మూడు సంవత్సరాల పదవీ కాలంలో డా.శ్రావణి ఎమ్మెల్యే తో విభేదాలతో రాజీనామా చేయడమూ తెలిసిందే.దాంతో ఆ పదవిని బిసి మహిళకు ఇవ్వకుండా ఉన్నత వర్గానికి చెందిన వ్యాపారవేత్త, మున్సిపల్ వైస్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ ను ఇంచార్జి చైర్మెన్ గా బాధ్యతలు అప్పగించారు.

ఇక అప్పటినుండి బిసి మహిళా రిజర్వేషన్ లో బిసి మహిళకే ఇవ్వాలని ఎమ్మెల్యే పై ఒత్తిడి తెస్తుండడం, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఇక బిఆర్ఎస్ మెజారిటీ సభ్యులు అంతర్గతంగా ఎదురుతిరిగడమూ తెలిసిందే. దీంతో, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ కవిత దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి, కౌన్సిలర్లను బుజ్జగించడంతో చైర్పర్సన్ ఆశావహులు ఏమీ అనలేక అంతర్మధనంలో ఉండిపోయారు.

ఈ అదునుతో తొమ్మిది సంవత్సరాలు మౌనంగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తనదైన శైలిలో రాజకీయం మొదలెట్టారు.దీంతో ఎట్టకేలకు ఈ నెల 28 న మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంతో…మెజారిటీ కౌన్సిల్‌ సభ్యులున్న బిఆర్ఎస్ ఆశావహులు తమ రాజకీయం స్టార్ట్ చేశారు.

ఈ పరిస్థితులలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రెండురోజులక్రితం శుక్రవారం కౌన్సిల్ సభ్యులతో సమావేశమయ్యారు. అందరితో చర్చించి, మున్నూరు కాపు వర్గానికి చెందిన బిసి మహిళా కౌన్సిలర్ శ్రీమతి సమిండ్ల వాణీశ్రీనివాస్ పేరున ప్రకటించారు. ఎమ్మెల్యే మాటను కాదనలేక అందరూ ఓకె చెప్పినట్లే చెప్పి, వారి రాజకీయం వారు ప్రారంభించారు.

ఇందులో ప్రధానంగా శ్రీమతి సమిండ్ల వాణీశ్రీనివాస్ ఎమ్మెల్యే నిర్ణయంతో అందరినీ సమన్వయపరుస్తుండగా, పద్మశాలి వర్గానికి చెందిన అడువాల జ్యోతిలక్ష్మణ్, వడ్డెర వర్గానికి చెందిన వల్లెపు రేణుకమొగిలి తమకే చైర్పర్సన్ పదవి కావాలని పట్టుబడుతూ, క్యాంపు రాజకీయాలకు తెరతీశారు.

అంతేగాకుండా, ఆర్థికంగా ఎదిగిఉన్న వల్లెపు రేణుక భర్త మొగిలి బిఆర్ఎస్ పార్టీ తో పాటు మిగతా కౌన్సిలర్లకు డబ్బు ఎర వేసినట్లు తెలుస్తుంది. ఒక్కో కౌన్సిలర్ కు రూ.50 వేలు అడ్వాన్స్ గా ముందుగానే “పే” చేస్తూన్నట్లు పట్టణంలో ప్రచారం సాగుతుంది.

ఎమ్మెల్సీ కవిత చెప్పినా, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ చెప్పినా వినం…అన్నట్టుగా ఒకవైపు వల్లెపు రేణుకామొగిలి, మరో వైపు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న అడువాల లక్ష్మణ్ సైతం మెజారిటీ వర్గమున్న పద్మశాలి వర్గానికే ఇవ్వాలంటూ, తన సతీమణి జ్యోతి కోసం పావులు కదుపుతున్నారు.

దీంతో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తన నిర్ణయాన్ని బహిరంగముగానే ప్రకటించి, ఇంతకన్నా తాను చెప్పగలిగింది లేదని నిర్మొహమాటంగా చెప్పేశారు.  అధికారంలో ప్రభుత్వం లేని ఈ పరిస్థితులలో, మెజారిటీ సభ్యులున్నప్పటికీ, ఇలా డబ్బుల ఎర చూపడం, అధికారం కోసం పార్టీ కి ఎదురు తిరగడం సరికాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ప్రజల్లో కూడా, కౌన్సిలర్లు డబ్బుకే ఓటేస్తుంటే…ప్రతిష్ట దిగజారుతుందని విమర్శిస్తూన్నారు.ఇక చూడాలి, ఎమ్మెల్యే నిర్ణయాన్ని బలపరుస్తారో, ధనం మూలం ఇదత్ జగత్… డబ్బుకు దాసోహం అన్నట్టుగా డబ్బు ప్రభావానికి లొగుతారో…వెయిట్ అండ్ సీ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights