గల్ఫ్ పాలిటిక్స్ – విశ్లేషణ (support: M. Bheemreddy):

Hyderabad

★ ఇద్దరు కాంగ్రెస్, ఒకరు నేతాజీ పార్టీ 

★ కోరుట్లలో గల్ఫ్ ఓటు బ్యాంకు అంచనా 53,665  

జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మికులు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన రిటనీలు, గ్రామాల్లో ఉన్న గల్ఫ్ కార్మికుల కుటుంబీకులు మొత్తం కలిసి ‘గల్ఫ్ ఓటు బ్యాంకు’ గా రూపు దిద్దుకుంటున్నారు. మైనారిటీ ఓటు బ్యాంకు లాగా, గల్ఫ్ ఓటు బ్యాంకు కూడా అభ్యర్థుల గెలుపు, ఓటములను శాసించే చేసే స్థాయిలో ఉన్నది.

2023 జనవరి లో ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గములో 2,23,867 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,07,331 పురుష ఓటర్లు. పురుష ఓటర్లలో 20 శాతం అనగా 21,466 మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారని అంచనా. ఎన్నికల  సమయంలో వీరు దూర దేశాల నుంచి స్వగ్రామానికి వచ్చి ఓటు వేయడం సాధ్యం కాదు. ఆన్ లైన్ ఓటింగ్ సౌకర్యం లేదు కాబట్టి విదేశాల నుంచి ఓటు హక్కు ఉపయోగించుకునే వీలు లేదు.

గత పది ఏళ్లలో 10,733 మంది గల్ఫ్ నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో నివసిస్తున్నారని ఒక అంచనా. గల్ఫ్ దేశాలలో ఉన్న ఒక కార్మికుడికి స్వదేశంలో కనీసం ఇద్దరు కుటుంబ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. ఈ లెక్కన గల్ఫ్ లో ఉన్నవారి కుటుంబ సభ్యులు 42,932 మంది ఓటర్లుగా ఉన్నారు. వాపస్ వచ్చిన వారిని కలుపుకుంటే కోరుట్ల నియోజకవర్గంలో గల్ఫ్ ఓటు బ్యాంకు అంచనా 53,665.  

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) గల్ఫ్ ఎన్నారై సెల్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి కోరుట్ల కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నరేష్ రెడ్డి మన్నెగూడెం గ్రామ సర్పంచుగా, జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడిగా ఉన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను  రాహుల్ గాంధీకి వివరించి ఆయన దృష్టిలో పడ్డారు. గల్ఫ్ తెలంగాణ ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రుద్ర శంకర్ కోరుట్ల కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇటీవల కోరుట్ల లో జరిగిన ‘పద్మశాలి రాజకీయ యుద్ధభేరి’ భారీ బహిరంగ సభ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన రుద్ర శంకర్ ఎమ్మెల్యే టికెట్ కు అప్లయి చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

చెరుకు రైతుల ఉద్యమ నాయకుడు, ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కొరకు పోరాడుతున్న సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు కోరుట్ల నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయం అయ్యింది. ఏ పార్టీ నుంచి అనేది స్పష్టత లేదు. 

సింగిరెడ్డి నరేష్ రెడ్డి, రుద్ర శంకర్, చెన్నమనేని శ్రీనివాస రావు ముగ్గురు కూడా గల్ఫ్ జెఏసి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్న ఈ ముగ్గురు ఉద్యమ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయడానికి కావలసిన ఆర్థిక స్తోమత ఉన్నవారు. 

కోరుట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు డా. కె. సంజయ్ ను బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ప్రకటించింది.

బీజేపీ టికెట్ రేసులో ముందున్న సురభి నవీన్ ఆశలన్నీ ఎంపీ అరవింద్ పైనే. పూదరి నిశాంత్ కార్తికేయ గౌడ్ కు బీఎస్పీ టికెట్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. కోరుట్ల కాంగ్రెస్ టికెట్ కోసం జువ్వాడి నర్సింగరావు, కల్వకుంట్ల సుజిత్ రావు, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్క, కొమిరెడ్డి కరంచంద్, మహమ్మద్ షాకీర్, కాటిపెల్లి శ్రీనివాస రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, రుద్ర శంకర్ లు దరఖాస్తు చేసుకున్నారు. 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (సింహం గుర్తు) ఒక గల్ఫ్ కార్మిక నేతకు కోరుట్ల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సూత్రప్రాయంగా సెంట్రల్ కమిటీ లో నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కోరుట్లలో బహుముఖ పోటీ అనివార్యం అని తేలిపోయింది. ఎవరు ఎవరి విజయావకాశాలపై గండి కొడతారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights