జగిత్యాల 

జగిత్యాల జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా వివరించారు.

 మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో… ఈ నెల 30న జరగనున్న ఎన్నికల ఏర్పాట్లపై వివరించారు.

జిల్లాలోని మూడు నియోజకవర్గాలు జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల లో 78 రూట్లలో మొత్తం 785 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అంతేకాకుండా జిల్లాలో 234 మంది మైక్రో అబ్జర్వర్లతో పాటుగా నిరంతర పర్యవేక్షణ కోసం 992 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.

ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు సంబంధించి కమ్యూనికేషన్ రూమ్ తో పాటు మీడియా మానిటరింగ్, వెబ్ కాస్టింగ్ విధానంతో పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టరేట్ నుండి నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని వివరించారు. అలాగే హోం ఓటింగ్ విధానంలో 1141 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు.

ఇంకా జిల్లాలో ఎన్నికలకు సంబంధించి జిల్లా యంత్రాంగం జిల్లాకు నియమించిన అబ్జర్వర్ల సూచనలతో అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని కలెక్టర్  వివరించారు.  అలాగే జిల్లాలోపోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ బుధవారం కూడా కొనసాగుతుందని, అందుకు సంబంధిచిన వారు రిటర్నింగ్ అధికారిని సంప్రదించి పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

36 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని… ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం కల్లా ఏర్పాట్లు పూర్తికానున్నాయని ఆమె వెల్లడించారు. కాగా భారత ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలకు సంబంధించి రూపొందించిన సి విజిల్ యాప్ కు మంచి స్పందన లభించిందని.. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుందని వివరించారు.

సి విజిల్ యాప్ తో పాటు 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు కూడా ఎవరైనా ఫోన్ చేయవచ్చునని.. ఎవరి పేరు కూడా బహిర్గతం కాదని తెలిపారు. 

ఇదిలా ఉండగా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో 161 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని.. అలాగే 10 కంపెనీల కేంద్ర బలగాలతో కూడిన సివిల్ పోలీస్ సిబ్బంది 3000 మంది ఎన్నికల ప్రశాంత నిర్వహణకు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు..

అలాగే ఎన్నికల ప్రశాంత నిర్వహణలో పోలీసు సిబ్బందితో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను కూడా నియామకం చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ ల నుండి వాహనాల తనిఖీల ద్వారా ఇతరత్రా తనిఖీల ద్వారా సుమారు రెండు కోట్ల 59 లక్షల రూపాయలు పట్టుకోవడం జరిగిందని వివరించారు.

ఇదిలా ఉండగా 30న జరగనున్న పోలింగ్ కు సంబంధించి మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టకుండా అదేవిధంగా బయట నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉండేలా తగు చర్యలు తీసుకుంటూ… బయటి నుంచి వచ్చిన వారిని పంపిస్తున్నామని… అలాంటి వారు ఎవరైనాప్పటికీ వారు తరలి వెళ్లాలని ఎస్పీ ఈ సందర్భంగా కోరారు.

ఎన్నికల ప్రశాంత నిర్వహణకు అన్ని వర్గాల వారు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తో పాటు జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights