ప్రత్యేక అధికారుల పాలనలో ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలి :రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి దాసరి అనసూయ (సీతక్క)

జగిత్యాల

-ప్రత్యేక అధికారులతో గ్రామ పంచాయతీల పాలన అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, అధికారులు

ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు గ్రామాలలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహణకై ఆదేశాలు

రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రణాళిక బద్ధంగా చర్యలు

ప్లాస్టిక్ రహిత గ్రామాల రూపకల్పన దిశగా కార్యాచరణ రూపొందించాలి

ఉపాధి హామీ కింద మంజూరు చేసిన పనులు త్వరితగతిన గ్రౌండ్ చేయాలి

ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, రాబోయే వేసవి కాలంలో ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి ఇబ్బందులకు గురికాకుండా పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దాసరి అనసూయ (సీతక్క) అన్నారు.

శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దాసరి అనసూయ (సీతక్క) ప్రత్యేక అధికారులచే గ్రామ పంచాయతీ పాలన నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ ఎం.హనుమంతరావు తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సమీకృత జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి దాసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, గ్రామాల్లో సర్పంచ్ లు పదవి కాలం ముగిసినందున మళ్ళీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారులతో పాలన సాగించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామానికిప్రత్యేక అధికారులను నియమించామని మంత్రి అన్నారు. 

ప్రత్యేక అధికారులుగా నియమితులైన వారికి గ్రామంపై సంపూర్ణ బాధ్యత,హక్కులు ఉంటాయని,  ప్రత్యేక అధికారులు నూతన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించుకొని, గ్రామ పంచాయతీ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. 

ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని, ప్రజలను, యువతను, మహిళలను భాగస్వామ్యం చేస్తూ గ్రామాలను అద్దంలా తయారు చేయాలని, ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ లో భాగంగా గ్రామాలలో మధ్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే వచ్చే నష్టాలపై అవగాహన సైతం కల్పించాలని, ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చివరి రోజున గ్రామసభ నిర్వహించాలని, పారిశుద్ధ కార్మికులకు సన్మానించాలని మంత్రి సూచించారు. ‌

ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ లో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు శుభ్రం చేయాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని, ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేసుకోవాలని, గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలందరిని భాగస్వామి చేస్తూ అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ రహిత గ్రామాల రూపకల్పన దిశగా కార్యాచరణ రూపొందించాలని మంత్రి అన్నారు. 

మేడారం జాతరలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ చర్యలు తీసుకుంటున్నామని, అదే సమయంలో భక్తులు సైతం జాతరకు ప్లాస్టిక్ తీసుకురాకుండా అవగాహన కల్పించాలని, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిర్వహించే జాతరలో సైతం ప్లాస్టిక్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. 

రాబోయే వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక అధికారులు త్రాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని, మిషన్ భగీరథ కార్యక్రమం క్రింద ప్రతి గ్రామానికి త్రాగునీరు బల్క్  సరఫరా జరుగుతుందని, గ్రామంలో అంతర్గత సరఫరా బాధ్యతలను గ్రామ పంచాయతీకే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్రాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కోటి రూపాయలు నిధులు కేటాయించిందని మంత్రి అన్నారు. 

గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేలా మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత కల్పించాలని, అందుబాటులో ఉన్న ఆర్థిక సంఘం నిధులను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ గ్రామాల్లో అవసరమైన పనులు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. 

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అధిక మొత్తంలో కూలీలకు పని దొరికేలా చూడాలని, వర్కింగ్ సైట్ లో ఉపాధి కూలీలకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, ఉపాధి హామీ కింద మంజూరు చేసిన పనులను త్వరితగతిన గ్రౌండ్ చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. 

**రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ,* గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైన నేపథ్యంలో నూతన పంచాయతీరాజ్ చట్టం, గ్రామపంచాయతీ విధి నిర్వహణ, విధానాలు వంటి అంశాలపై ప్రత్యేక అధికారులకు అవగాహన కల్పిస్తూ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. 

రాబోయే వేసవి కాలంలో త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.  గ్రామంలో త్రాగునీటి కనెక్షన్లపై సర్వే నిర్వహించి, ఇంకా నల్లా కనెక్షన్ లేని ఇండ్లు గుర్తించాలని అన్నారు. 

త్రాగునీటి సరఫరాకు సంబంధించి ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునే అవకాశం ఉందని, అవసరమైన చోట నీటి లీకేజీ మరమ్మత్తు పనులు, నీటి సరఫరా పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. 

గ్రామంలో అంతర్గత నీటి సరఫరా, నూతన నల్ల కనెక్షన్ పనుల ప్రతిపాదనలు తయారు చేసి జల్ జీవన్ మీషిన్ ద్వారా నిధులు పొందాలని  తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులు ఎన్నికల కంటే ముందే గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. 

ప్రభుత్వం గురుకులాలు పాఠశాలల్లో విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫాం లు స్వయం ఉపాధి మహిళా సంఘాల ద్వారా కుట్టించాలని ప్రభుత్వం భావిస్తుందని, ఇందుకోసం జిల్లా స్థాయిలో అనుసరించాల్సి విధానంపై ప్రణాళిక రూపొందించి సమర్పించాలని అన్నారు.  పంచాయతీలో తప్పనిసరిగా పంచాయతీ కార్యదర్శి ఉండే విధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights