సర్పంచుల ఉసురు పోసుకున్న ఘనత బిఆర్ఎస్ పార్టీది.
–జెడ్పి ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్.

చిగురుమామిడి : (Reporter:M.Kanakaiah)

సర్పంచుల పెండింగ్ బిల్లు గురించి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని…. చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జెడ్పి ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ అన్నారు.

సర్పంచుల పెండింగ్ బిల్లుల గురించి కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు నెలల తరబడి గ్రామపంచాయతీ బిల్లులు చెల్లించకుండా సర్పంచులను మనోవేదనకు గురి చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు.

సకాలంలో బిల్లులు చెల్లించకుండా సర్పంచుల ఉసురు పోసుకున్న ఘనత బిఆర్ఎస్ పార్టీదేనన్నారు. బిల్లులు రాక అప్పులు కట్టలేక మనస్థాపానికి గురై సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలను కేటీఆర్ మర్చిపోయారన్నారు.

మండలాలలో జిల్లా కేంద్రాలలో సొంత పార్టీలో ఉన్న బిఅర్ఎస్ సర్పంచులు ఆందోళనలు చేపట్టిన సంగతి గుర్తుతెచ్చుకోవాలన్నారు. సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలను బహిష్కరించారని, పల్లె ప్రగతి కార్యక్రమానికి దూరంగా ఉన్నారని, కొంతమంది సర్పంచులు బిల్లులు సకాలంలో చెల్లించినందుకు ఏకంగా పార్టీకే రాజీనామా చేసిన ఉదాంతాలను గుర్తు చేసుకోవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన 15 ఫైనాన్స్ బిల్లులను కూడా ఫ్రీజింగ్ చేస్తూ సర్పంచులను నానా ఇబ్బందులకు గురి చేశారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు విలువ లేకుండా పోయిందని, స్థానిక సంస్థల తీర్మానాలకు ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు.

ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా అధికారాన్ని అంతటిని తమ గుప్పిట్లో ఉంచుకొని స్థానిక సంస్థల నాయకత్వాన్ని నీరుగార్చరన్నారు. అధికారంలో ఉన్నన్నినాళ్లు సర్పంచులను మానసిక క్షోభకు గురిచేసి ప్రస్తుతం పెండింగ్ బిల్లుల కోసం పోరాడుతామని చెప్పడం సిగ్గుచేటనీ అన్నారు.

ఖజానాను ఖాళీ చేసి ఆరు కోట్ల అప్పులు చేసి చిప్పలు చేతికిచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన గ్రామపంచాయతి ప్రాధాన్యతను పెంచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ గ్రామ స్వరాజ్యం ఏర్పాటుకు చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ నాయకులు కోనేటి రాములు, వంగ కనుకయ్య, గట్టు ప్రశాంత్, పోటు మల్లారెడ్డి మరియు గుజ్జుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights