నాటికీ-నేటికీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలలో కాసుగంటి ఒక్కరే ఏకగ్రీవ ఎమ్మెల్యే

జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం 1957లో ఏర్పడగా…ఇప్పటివరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాసుగంటి లక్ష్మీనర్సింహారావు వకీల్ ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.

మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన ఆయన జగిత్యాలలోనే స్థిరపడి న్యాయవాదిగా (వకీల్) కొనసాగారు. ఆయనను ప్రజలు వకీల్ సాబ్ అని ఆప్యాయంగా పిలిచేవారు.

ఆయనకు ప్రజల్లో ఉన్న పేరు, ప్రఖ్యాతులను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ 1962 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల టికెట్ ఇవ్వగా విజయం సాధించారు.

రెండోసారి 1967లోనూ కాంగ్రెస్ తరుపున బరిలో నిలవగా.. ఆయనపై ఎవరూ పోటీ చేయకపోవడంతో ఏకగ్రీవమయ్యారు.

1972లోనూ పోటీ చేయాలని కాంగ్రెస్ కోరినా.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని టికెట్ ను తిరస్కరించడం విశేషం.

ఆయన శిష్యుల్లో నారాయణరెడ్డి, జువ్వాడి రత్నాకర్ రావు, జగపతిరావు లు జగిత్యాల, బుగ్గారం, మెట్ పల్లి, కరీంనగర్ నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలుగా గెలిచారు.

కాసుగంటి లక్ష్మీనర్సింహారావు జగిత్యాల నుంచి అసెంబ్లీకి ఆర్టీసీ బస్సులోనే వెళ్లే వారు. గ్రామాల్లో విద్యుత్, రోడ్ల సమస్యల పరిష్కారానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో కాసుగంటి లక్ష్మీనర్సింహారావు కుటుంబానికి, ఆయన సోదరుల కుటుంబాలకు ఒక ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పవచ్చు.

కాసుగంటి లక్ష్మినర్సింహారావు విద్యారంగంపట్ల ప్రత్యేక శ్రధ్ద చూపారని అనడానికి నిదర్శనం…ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలకు.. కోట్లాది రూపాయల విలువచేసే.. సుమారు 35 ఎకరాల భూమిని కాసుగంటి సోదరులు ధారాదత్తం చేయడమే…

ఆ కళాశాలకు శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలగా (SKNR ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలగా) నామకరణం చేయడం జరిగింది.

అలాగే, డిగ్రీ కళాశాల విద్యార్థులను మరింతగా ప్రోత్సహిస్తూ, వారిలో పోటీతత్వం పెంచడానికిగాను కాసుగంటి ఫ్యామిలీ ట్రస్టు తరఫున గోదావరి వ్యాలీ, సరస్వతీ శిశుమందిర్ కాసుగంటి సుధాకర్ రావు, కపిల్ చిట్స్ కాసుగంటి వామన్ రావు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ వకీల్ ల నేతృత్వంలో ప్రతీ సంవత్సరం డిగ్రీ కళాశాలలోని ఒక్కో గ్రూప్ లో ప్రథమస్థానంలో మార్కులు సాధించి, ప్రతిభ కనబర్చిన ఉత్తమ విద్యార్థికి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.2లక్షల నగదు ప్రోత్సాహకాలందజేస్తూ…కాసుగంటి పరంపరను కాపాడుతున్నారని చెప్పవచ్చు.

కాసుగంటి లక్ష్మినర్సింహారావు జ్ఞాపకార్ధం ఆయన కుటుంబ సభ్యులు కాసుగంటి ఫ్యామిలీ ట్రస్టు ద్వారా రూ.కోటిన్నరతో జగిత్యాల కోర్టులో స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ వకీల్ ఆధ్వర్యంలో న్యాయవాదుల కోసం ఒక గ్రంథాలయ భవనాన్ని సైతం నిర్మించారు.

అంతేగాకుండా…కాసుగంటి ఫ్యామిలీ ట్రస్ట్ జగిత్యాల జిల్లాలోని అత్యంత పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధికి సుమారు 32 ఎకరాల భూమిని సైతం అందజేసి….రాజకీయ, సామాజిక, విద్యారంగ అభివృధ్ది కార్యక్రమాలతో పాటుగా ధార్మిక కార్యక్రమాలలో సైతం భాగస్వాములయ్యారు.

ఇలా, కాసుగంటి లక్ష్మినర్సింహారావు వకీల్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవ ఎమ్మెల్యేగా నేటి వరకూ నిలిచిన తీరు జగిత్యాలకే ఆదర్శం అని చెప్పుకోవచ్చు…

వ్యాపారమే ప్రధానంగా… ధనార్జనే ధ్యేయంగా ఉన్న ప్రస్తుత తరుణంలో కాసుగంటి కుటుంబం జగిత్యాలకు చేస్తున్న విద్యా, సామాజిక, సేవా కార్యక్రమాలపట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు, అభినందనలు చెప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ సందర్భంలో కాసుగంటి ఫ్యామిలీ ట్రస్టు చేస్తూన్న సేవాకార్యక్రమాలకు శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అలుమ్ని తరఫున కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ.అశోక్, అధ్యాపక బృందం మరియు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్, జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ ధన్యవాదాలు, కృతజ్ఞతలు…శతధా సహస్ర వందనాలతో…..

One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights