పండితుల సంభాషణల్లో…..

తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత అని ఇలా 60 ఉంటాయి. పూర్వం పండితులు తమ చుట్టూ ఉన్న వారికి అర్ధం కాకుండా ఉండాలనో, అర్ధాలు తెలిస్తే చిన్నబుచ్చుకుంటారనో తెలియదు కానీ తమ సంభాషణల్లో కొన్ని పదాలకు బదులు ఆ అర్ధాలు వచ్చే సంవత్సరాల పేర్లు వాడేవారు. వాటిలో కొన్ని తిట్లూ, కొన్ని ప్రశంసలూ, అడపా దడపా విమర్శలూ కూడా ఉంటాయి. వాటి గురించి చెప్పుకుందాం సరదాకి.

‘ ఒరే! వాడొట్టి ఇరవై ఐదూ, ఇరవై ఆరు రా’ అన్నాడంటే ‘వాడు గాడిద కొడుకు’ అని తిడుతున్నాడని అర్ధం. 25వ సంవత్సరం పేరు ‘ఖర’ ( అంటే గాడిద). 26వ సంవత్సరం పేరు నందన ( అంటే కొడుకు).

‘ నీ కొడుక్కేంట్రా ‘ఇరవై తొమ్మిది’. గొప్పింటి సంబంధాలు వస్తాయి’ అంటే మన్మధుడని. 29వ సంవత్సరం పేరు ‘మన్మధ ’.

‘వాడికోసారి ‘నలభై’ జరిగినా తెలిసి రాలేదు’ అంటే ‘పరాభవం జరిగినా’ అని. 40వ సంవత్సరం ‘ పరాభవ’.

‘వాడి కూతురికి సంబంధాలు రావడం కొంచెం కష్టంరా ‘ముప్పయి’ , ‘ముప్పై మూడు’ కదా! ‘ అన్నాడంటే ‘రూపవతి కాదని’ అర్ధం. 30వ సంవత్సరం ‘దుర్ముఖి’ 33వ సంవత్సరం ‘వికారి’.

‘ నీ నలభై ఎనిమిది’ కి కారణమేంటో తెలుసుకోవచ్చా?’ 48వ సంవత్సరం పేరు ‘ఆనంద’.

‘ వాడితో వాదనెందుకురా వాడో ‘యాభై అయిదు ’. అంటే బుద్ధిలేనివాడని అర్ధం. 55వ సంవత్సరం ‘దుర్మతి’.

‘అబ్బ వాళ్ళ పిల్లలతో వేగలేమండీ! అందరూ ‘నలభై ఒకటి’ లే’ అంటే కోతులూ కప్పలూ అని అర్ధం. 41వ సంవత్సరం ‘ప్లవంగ’.

‘ వాడసలే ‘ముప్పై ఎనిమిది’ జాగ్రత్తగా మాట్లాడు. అంటే కొంచెం కోపిష్టి అని. 38వ సంవత్సరం పేరు ‘క్రోధి.

-(Sri.T.Muralidhar, Rtd.Judge)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights