దుద్దిళ్ల శ్రీపాదరావు 

(మార్చి 2, 1935 – ఏప్రిల్ 13, 1999) ,          

9వ శాసనసభ స్పీకర్ (1989–1994)

(19.08.1991 నుండి 11.01.1995 వరకు)

1935 సంవత్సరంలో మార్చి 2న  కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్ రాధాకిష్టయ్య-కమలాబాయి దంపతులకు జన్మించిన అజాతశత్రువు శ్రీపాదరావు.

ఇంటర్, డిగ్రీ హైదరాబాద్ లో చేసిన తరువాత ఆదిలాబాద్  జిల్లాలో పంచాయతి ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం కొన్ని రోజులు చేశారు. ఆ తరువాత నాగపూర్ లో న్యాయవాదిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ఎల్. ఎల్. బి. పూర్తి చేసి ప్రాక్టీసు పెట్టారు. తండ్రి మరణాంతరం స్వంత ఊరికి వచ్చిన శ్రీపాదరావు వ్యవసాయమే వృత్తిగా చేసుకొని, కర్షక పాత్రలో గ్రామంలోనే ఉన్నాడు.

రాజకీయ అరంగేట్రం:

కొన్ని రోజుల తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామం నుండి సర్పంచిగా పోటీ చేయాలని ప్రజలు ఒత్తిడిచేశారు. నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న శ్రీపాదరావు రాజకీయాల్లోకి అడుగిడాలని స్నేహితులు, ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో అడుగులు వేస్తూ పోటి చేసి, మొట్ట మొదటిసారి సర్పంచ్ గా ఎన్నుకోబడ్డారు. వరుసగా మరో మారు ఆయనకే ప్రజలు మద్దతు పలకడంతో రెండవసారీ ఎన్నికయ్యారు. 

క్రమంగా, మహాదేవపూర్ సమితి అధ్యక్షునిగా శ్రీపాదరావు ఎన్నికైన తరువాత ఎల్ ఎం బి ఛైర్మన్ పదవికి మంథని నుండి గెలిచాడు. దీంతో పూర్తిగా నియోజకవర్గానికే ఆయన సుపరిచితమై, అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. అయన ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్ట, సుఖాలలో పాలుపంచుకొని ప్రజానాయకునిగా ఎదిగాడు.

ఎన్టిఆర్ ప్రభంజనం సైతం తలవంచింది:

దాంతో, 1984 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గా పోటి చేసే అవకాశం లభించింది. అప్పుడే పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ ప్రభావం, ఎన్టిఆర్ ప్రభంజనం సైతం తలవంచి ప్రజానాయకుడు  శ్రీపాదరావు విజయం సాధించారు.

మూడు సార్లు శాసన సభ్యులుగా:

ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు శాసన సభ్యులుగాఎన్నికైన శ్రీపాదరావు, అన్ని పార్టీల మద్దతుతో శాసనసభ స్పీకర్ గా పదవినధిష్టించారు.

శ్రీ శ్రీపాదరావు 1983వ సంవత్సరంలో ఏడవ శాసనసభకు, 1985వ సంవత్సరములో ఎనిమిదవ శాసనసభకు, 1989వ సంవత్సరంలో తొమ్మిదవ శాసనసభకు కరీంనగర్ జిల్లా మంథని నియోజవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికైనారు. గ్రంథాలయ కమిటీ, ప్రభుత్వ హామీల కమిటీ మరియు అంచనాల కమిటీలలో సభ్యునిగా ఉన్నారు.వీరు న్యూఢిల్లీలో 1991వ సంవత్సరములో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశంలోనూ, 1992వ సంవత్సరములో జరిగిన అఖిల భారత స్పీకర్ల సమావేశంలోనూ పాల్గొన్నారు.

శ్రీ శ్రీపాదరావుగారిని 1999వ సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీన నక్సలైట్లు కాల్చిచంపారు. వీరు చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ భావంతో కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకానికి వీరి పేరు పెట్టడం జరిగింది.

వీరు శాసనసభ స్పీకరుగా మృదు స్వభావంతో వ్యవహరించి అందరి మన్ననలను పొందారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకే సార్వభౌమాధికారం ఉంటుందని, ప్రజలు ఆ అధికారాన్ని చట్టసభల సభ్యుల ద్వారా వినియోగించుకుంటారని, ప్రభుత్వ విధానాలు చట్టసభలలో జరిగే చర్చల ద్వారానే రూపొందుతాయని, ప్రభుత్వ విధానాల తీరు తెన్నులను తెలుసుకొనే అధికారం ప్రజాప్రతినిధులకు ఉంటుందని, కనుక ప్రజాప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం ప్రభుత్వ అధికారుల కర్తవ్యమని, ఈ విషయంలో ప్రజాప్రతినిధుల ప్రాధాన్యతను తగ్గించివేయటం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని శ్రీ డి. శ్రీపాదరావు 1994, మార్చి 15వ తేదీన రూలింగులో స్పష్టం చేశారు.

శాసనసభ స్పీకర్ గా:

(19.08.1991 నుండి 11.01.1995 వరకు)

శాసనసభ స్పీకర్ గా ఆ పదవికి వన్నె తెచ్చారు. ఎంతోమంది ప్రశంసలు పొందారు. ఇప్పటికీ, శాసన సభ స్పీకర్ అంటే శ్రీపాదరావు మాత్రమే గుర్తుకొస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకవైపు స్పీకర్ పదవిని బాధ్యతతో నిర్వర్తిస్తునే… తన స్వంత నియోజకవర్గం మంథని ప్రజలను మాత్రం మరిచిపోకుండా, మరింత దగ్గరయ్యారు. విమర్శలకు వెరవకుండా, పొగడ్తలను లెక్క చేయకుండా, అభివృద్ధిఫై దృష్టి సారిస్తూ అందరికీ తలలో నాలుకగా, ప్రజలతో మమేకమవడమే గొప్పతనంగా భావించి, అందరికీ ఆప్తుడయ్యారు.మంథని నియోజకవర్గం  అభివృద్ధి కి బాటలు వేశారు.

ఓటమి చెందినా, ప్రజలతోనే మమేకమై:

1994 ఎన్నికల ముందు నక్సల్స్, పోలీసుల మధ్య జరిగిన ప్రత్యేక్ష పోరు తీవ్రంగా ఎన్నికలలో ప్రభావం చూపింది. ఈ ఎన్నికల్లో శ్రీపాదరావు పరాజయం పాలయ్యాడు. 

శ్రీపాదరావు ఓటమి పాలయినప్పటికీ, ప్రజలకు మాత్రం దూరం కాలేదు. ప్రతిపక్ష నాయకులపట్ల గానీ, పాలకపక్షంపై గానీ ఎలాంటి విమర్శలు చేయకుండా  హుందాగా వ్యవహరించి, ప్రజాభిమాన్ని మరింత చూరగొన్నారు.

నక్సల్స్ దుశ్చర్య :ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులను పట్టించుకునే పరిస్థితుల్లోనే ఆయనను మృత్యువు నక్సల్స్ రూపంలో కబళించింది.1999 ఏప్రిల్ 13న మహదేవ్ పూర్ మండలం అన్నారంకు తన అనుచరవర్గంతో వెళ్లివస్తున్న క్రమంలో మార్గమధ్యంలోని అడవుల్లో ఆయన వాహనాన్ని నక్సల్స్ ఆపివేసి, ఆయనతో మాట్లాడాలని చెప్పి లోపలి తీసుకెళ్ళి, కర్కశంగా తుపాకి తూటాలతో విగత జీవున్ని చేశారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఎన్నడూ ఎవరికీ అపకారాన్ని తలపెట్టని ప్రజా నాయకుణ్ణి నిష్కారణంగా హతమార్చిన నక్సల్స్ పై విమర్శల వర్షం కురిసింది.ఆ సమయంలో రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ప్రజల కోసం తుపాకులు పట్టినట్లు చెప్పుకొనే నక్సల్స్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడంను ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానే విమర్శించారు. 

అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం హుటాహుటిన మార్చురీలో ఉన్న మృత దేహాన్ని చూసేందుకు తరలివచ్చారు. నక్సల్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కన్నీటి పర్యంతమై అజాతశత్రువు శ్రీపాదరావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

ఆయన అజాతశత్రువే:

దురదృష్టవశాత్తు, శ్రీపాదరావు మృతిచెందినా, అందని దూర తీరాలకు వెళ్లిపోయినా…ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అజాత శత్రువతడు అనడంలో ఎలాంటి సందేహం లేదు…… ముమ్మాటికీ, ఆ అజాత శత్రువు, ఉన్నత ప్రజా నాయకుడు దుద్దిళ్ల శ్రీపాద రావు గారికి ఆయన జయంతి సందర్భంగా ” తెలంగాణ రిపోర్టర్” (editor:sircilla srinivas)వినమ్రపూర్వక నివాళులు అర్పిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights