హైదరాబాద్‌:

గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్‌బుక్కులు, డిజిటల్‌ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.,

గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ప్రస్తుతం డిజిటల్‌ సంతకాల కీలు పెన్‌డ్రైవ్‌ల రూపంలో సర్పంచులు, ఉప సర్పంచుల వద్ద ఉన్నాయి. వాటిని పంచాయతీ కార్యదర్శులు స్వాధీనం చేసుకోనున్నారు.

వారికి జాయింట్‌ చెక్‌పవర్‌

ఫిబ్రవరి రెండో తేదీన విధుల్లో చేరనున్న ప్రత్యేకాధికారులకు ప్రభుత్వం డిజిటల్‌ సంతకాల కీలను ఇవ్వనుంది. ఇప్పటి వరకు సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్‌ చెక్‌పవర్‌ ఉండగా.. ఇకపై ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్‌ చెక్‌పవర్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులకు సంబంధించి వారిద్దరి సంతకాలతో నిధులు డ్రా చేసుకొని వెచ్చించే వీలుంటుంది.

ప్రత్యేకాధికారుల కేటగిరీ ఇలా

రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలకు జిల్లా స్థాయి అధికారి ప్రత్యేకాధికారిగా ఉంటారు. మేజర్‌ గ్రామ పంచాయతీలకు తహసీల్దార్లు, పెద్ద జనాభా గల ఇతర గ్రామాలకు ఎంపీడీవోలు, ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన ఉప తహసీల్దార్లు, మండల పంచాయతీ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది.

3న మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌

ఈ నెల మూడో తేదీన రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు. ఈ సందర్బంగా పాలన ఎలా ఉండాలో వారికి మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో 2018 ఆగస్టులో తొలిసారిగా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన వచ్చింది. జనవరి వరకు ఆరు నెలల పాటు కొనసాగింది. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రత్యేకాధికారుల పాలన రావడం ఇది రెండోసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights