హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం వేదిక‌గా బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నిక‌ల శంఖారావాన్నిపూరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘హుస్నాబాద్‌ అన్నాదమ్ముళ్లు, అక్కచెల్లెండ్లకు నమస్కారాలు.

2018లో శాసనసభ ఎన్నికల మొదటి సభలో నేను ఇక్కడికే వచ్చి ప్రసంగించడం జరిగింది. హుస్నాబాద్‌ గడ్డ ఆశీర్వాదంతో ఆనాడు 88 సీట్లతో అఖండమైన విజయాన్ని సాధించాం. ఈ సారి కూడా ఇక్కడి నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలని పెద్దలు చెప్పారు. హైదరాబాద్‌లో అభ్యర్థులకు బీఫారాలు అందజేసి, అక్కడి నుంచి మేనిఫెస్టో ప్రకటించి నేను మీ దర్శనానికి వచ్చాను. ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుతున్నా. నేను చెప్పే మాటలు విని విడిచిపెట్టి వెళ్లొద్దు. పట్టణంలో బస్తీలో, గ్రామానికో, తండానికో పోయిన తర్వాత కేసీఆర్‌ నాలుగు మాటలు చెప్పిండు.. ఇందులో నిజమేంత అని ఆలోచించాలి’ అన్నారు.

సుట్టం చెప్పాడని ఓటు వేయొద్దు..

‘ఎన్నికలు వస్తుంటయ్‌ ఎవరో ఒకరు గెలుస్తుంటరు. ఎన్నికలు రాంగనే ఆగం కావొద్దు. రౌతు ఏందో.. రత్నం ఏదో ఆలోచించాలి. మనకు పనికి వచ్చేది ఏదో గుర్తు పట్టాలి. ఎవరో చెప్పారని అవలోకగా వేయొద్దు. ఓటు మన తలరాతను మారుస్తుంది. ఓటు తాలూక రాత, జిల్లా రాతను, రాష్ట్రం భవిష్యత్తును మారుస్తుంది. మా బావ మరిది చెప్పిండు. మా సుట్టం చెప్పండో.. మా మ్యానమామ చెప్పండని ఓట్లు వేయకూడదు. ఖచ్చితంగా ఆలోచించి స్పష్టమైన అవగాహనతో ఓటింగ్‌ జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గెలుస్తారు. ప్రజల కోరికలు నెరవేరుతాయి. తొమ్మిదిన్నర సంవత్సరాల కింద తెలంగాణ పరిస్థితి ఎలా ఉండే ఎలా ఉండే.. ఎక్కడ చూసినా భయమయ్యే పరిస్థితి. వలసలు, కరువు, సాగునీరు లేదు.. మంచినీరు లేదు. కరెంటు లేదు. ఆర్థిక పరిస్థితి ఎట్ల ఉంటదో తెలియదు. కొత్తకుండలో ఈగచొచ్చినట్లు కొత్త సంసారం. ఎక్కడ మొదలుపెట్టాలి. ఎక్కడికి తీసుకుపోయావాలి.. ఏవిధంగా పైకి వెళ్లాలని.. రాష్ట్రంలో ఉన్న యావత్‌ ప్రజానీకాన్ని ఎలా ఆదుకోవాలనే జఠిలమైన సమస్య నా ముందు ఉండేది’ అన్నారు.

కుట్రలు చేసినా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం..

‘తెలంగాణ వచ్చిన తర్వాత బాధ్యత బీఆర్‌ఎస్‌మీదనే ప్రజలు పెట్టారు. చాలా బాధ్యతగా పెద్ద ఆర్థిక నిపుణులు రాష్ట్రానికి చెందిన, బయట రాష్ట్రాలకు చెందిన రప్పించి రెండుమూడు నెలలపాటు మేధోమథనం చేశాం. ఎక్కడ ఉన్నాం.. ఏం చేయాలి.. ఎక్కడికి పోవాలి.. ఎక్కడ చూసినా కటిక చీకటి. నీళ్లు లేవు. పంటలు పండవు.. బతుకలేక వలసపోయిన వారు కొందరు.. ఇక్కడే ఒంటి సావలేక బతుకుతున్న వారు కొందరు. చాలా ఘోరమైన పరిస్థితులుండేవి. మీ అందరికీ తెలుసు. 14-15 సంవత్సరాలు ఏకబీగిన పోరాడి తెలంగాణను ఈ రోజు అనేక రంగాల్లో అందరి సహకారంతో నెంబర్‌ వన్‌ స్థానానికి తీసుకుపోయాం. తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగంలో, మంచినీటి రంగంలో, పల్లెల్లో పచ్చదనం, పారిశుధ్యం ఏర్పాటు చేయడంలో తెలంగాణ నెంబర్‌ వన్‌. పారిశ్రామిక విధానంలో మనకు ఎవరూ పోటీలో లేరు. సాటి కూడా లేరు. పెట్టుబడులు సాధించడంలో, 20-25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంలో, పారిశ్రామిక విధానం, ఐటీ రంగంలో నెంబర్‌ వన్‌గా ఉన్నాం. కేంద్రం సహకారం లేకపోయినా.. ప్రతిపక్షాలు గౌరవెల్లి లాంటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఎన్నో కేసులు వేసినా, కుట్రలు చేసినా అధిగమించుకుంటూ ఒకటిఒకటి చేసుకుంటూ వచ్చాం. అద్భుతమైన విజయాలు కొన్ని సాధించాం’ అని వివరించారు.

హుస్నాబాద్ గెలుపు.. బీఆర్ఎస్ పార్టీ 95 నుంచి 100 సీట్లు గెలిచేందుకు నాంది కావాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.

ఇవాళ అనేక విష‌యాల్లో దేశానికి ఆద‌ర్శం అయ్యాం అని కేసీఆర్ తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ గెల‌వాలి. ఎమ్మెల్యే స‌తీశ్ బాబు ప్ర‌తి ఒక్క‌రికి అందుబాటులో ఉంటారు. బ్ర‌హ్మాండంగా మీ సేవ కోసం ప‌ని చేస్తున్నారు. 60 వేల భారీ మెజార్టీతో గెలుస్తార‌ని విశ్వాసం ఉంది. హుస్నాబాద్ గెలుపు.. 95 నుంచి 100 సీట్లు గెలిచచేందుకు నాంది కావాలి. ఈ తొలి బ‌హిరంగ స‌భ‌లో మీ ఆశీర్వాదం కోర‌డానికి వ‌చ్చాను. బ్ర‌హ్మాండ‌మైన మేనిఫెస్టోను ప్ర‌క‌టించాం. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఉధృతంగా ప్ర‌చారం చేయాలి. అద్భుత‌మైన విజ‌యం సాధించాల‌ని కేసీఆర్ ఆకాంక్షించారు.

ఇప్పుడు మోటార్లు కాల‌డం లేదు..

కాంగ్రెస్ హ‌యాంలో క‌రెంట్ ప‌రిస్థితి ఎట్ల ఉండేనో ఆలోచించుకోవాలని కేసీఆర్ గుర్తు చేశారు. ట్రాన్స్‌ఫార్మ‌ర్ కాలుడు, మోటార్ కాలుడు. వ‌చ్చిన నాలుగు రూపాయాలు దానికే పోవుడే. ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ కాలిపోతే బాయికి రూ. 2 వేల చొప్పున‌ వ‌సూలు చేసి తీసుకుపోయేవారు. ఇప్పుడు మోటార్లు కాల‌డం లేదు. ఉత్త‌మ‌మైన నాణ్య‌మైన విద్యుత్ అందిస్తున్నాం అని కేసీఆర్ తెలిపారు.

హుస్నాబాద్‌లో క‌నుచూపు మేర పంట పొలాలే..

ఒక‌ప్పుడు హుస్నాబాద్ క‌రువు ప్రాంత‌మ‌ని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఇవాళ హెలికాప్ట‌ర్ నుంచి చూస్తుంటే చాలా ఆనందం క‌లిగింది. క‌నుచూపు మేర‌ పంట పొలాలు క‌న‌బ‌డుతున్నాయి. చెక్ డ్యాంలు క‌ట్టుకున్నాం, ప్రాజెక్టుల‌ను క‌ట్టుకున్నాం. దేవాదుల‌, తోట‌ప‌ల్లి బ్యారేజీ నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఎన్నిక‌ల త‌ర్వాత మూడు నాలుగు నెల‌లు క‌ష్ట‌ప‌డితే.. ల‌క్ష ఎక‌రాల‌కు నీళ్లందించే ప్రాజెక్టులు కూడా పూర్త‌వుతాయ‌ని సీఎం తెలిపారు.

భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయి.. వ్య‌వ‌సాయానికి స్థిర‌త్వం వ‌చ్చింది..
కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్ల‌క్ష్యానికి గురైన‌ మ‌హాస‌ముద్రం గండి పూర్తి చేయ‌డంతో 10, 12 గ్రామాల్లో ఊట‌లు పెరిగాయ‌ని కేసీఆర్ గుర్తు చేశారు. ఒక ప‌ద్ధ‌తిగా ముందుకు వెళ్తున్నాం కాబ‌ట్టి భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయి. వ్య‌వ‌సాయానికి అర్థం, స్థిర‌త్వం వ‌చ్చింది. కంటి నిండా రైతు నిద్ర పోతున్నారు. క‌డుపు నిండా క‌రెంట్.. క‌ల్లాల నిండా వ‌డ్లు క‌నిపిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా, తారు రోడ్ల‌లో ధాన్య‌పు రాశుల‌తో ల‌క్ష్మీదేవీ నాట్యం చేస్తున్న‌ట్లు రాశులు క‌న‌బ‌డుతున్నాయని కేసీఆర్ తెలిపారు.

క‌రువు ప్రాంతంగా ఉన్న చిగురుమామిడి గ్రీన్ ఏరియాగా మారింది..

మిష‌న్ భ‌గీర‌థ ద్వారా నేరుగా గ్రామం ట్యాంకులో నీళ్లు ప‌డుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి స్కీం ప్ర‌పంచంలో ఎక్క‌డా లేదు. ఐదు సంవ‌త్స‌రాల నుంచి నీళ్ల స‌ర‌ఫ‌రా బ్ర‌హ్మాండంగా కొన‌సాగుతోంది. అలా అనేక కార్య‌క్ర‌మాలు చేసుకున్నాం. చిగురుమామిడి మండ‌లం ఒకప్పుడు క‌రువు ప్రాంతంగా ఉండే. తోట‌ప‌ల్లి బ్యారేజీ నుంచి నీళ్లు రావ‌డంతో గ్రీన్ ఏరియాగా మారిపోయింది. ఇవ‌న్నీ కూడా మీ కండ్ల ముందున్న నిజాలు అని కేసీఆర్ చెప్పారు.

గౌర‌వెల్లి, శ‌నిగ‌రం ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..

హుస్నాబాద్‌కు కావాల్సిన ప‌నులు రెండు మూడు ఉన్నాయి.. గౌర‌వెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాల‌ని కోరారు. ఎన్నిక‌ల త‌ర్వాత‌ ఐదారు నెల‌ల్లో యుద్ధ‌ప్ర‌తిపాద‌న పూర్తి చేసి ఇదే హాదాలో వ‌చ్చి నీళ్లు వ‌దులుతాం. శ‌నిగ‌రం ప్రాజెక్టు ప్ర‌ధాన కాల్వ పూర్తి కావాల‌ని కోరుతున్నారు. ఆ ప్రాజెక్టు క‌ట్ట లీకేజీలకు మ‌ర‌మ్మ‌తులు చేస్తాం. ఈ ప్రాజెక్టును కాళేశ్వ‌రంతో క‌లిపాం కాబ‌ట్టి గోదావ‌రి నీటితో పంట‌లు పండుతాయి. వీర‌భ‌ద్ర స్వామి ఆల‌యం బాగా ఉంది. కొత్త‌కొండ జాత‌రకు చిన్న‌తంలో నేను కూడా వ‌చ్చి మిఠాయి తిన్నాను. మ‌న‌ జాన‌ప‌దులు వ‌చ్చి కొలిచే ఆల‌యం అది. దాన్ని త‌ప్ప‌కుండా అభివృద్ధి చేస్తాం. సిద్దిపేట – ఎల్క‌తుర్తి ర‌హదారిని విస్త‌రించాల‌ని కోరారు. దాన్ని కూడా ప‌రిశీలిన చేస్తాం. ముల్క‌నూరులో కొత్త బ‌స్టాండ్, ఎల్కతుర్తిలో ప్ర‌భుత్వ కాలేజీ మంజూరు చేయిస్తాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights